తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. ఇక బీజేపీ తన జాబితాపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించాల్సి ఉన్నా.. ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది. అయితే తాజాగా ఈ నెల 20 లేదా 21న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 60 మందితో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశం ఉందని తెలిపాయి. తొలి జాబితాలో 20 మందికి పైగా బీసీలకు సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్, బీఆర్ఎస్ విస్మరించిన కులాలకు సీట్లు ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముదిరాజ్ కులానికి 5 అసెంబ్లీ సీట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం దిల్లీ వెళ్లనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు లక్ష్మణ్. రేపు, ఎల్లుండి జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పాల్గొంటారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది.