కేరళ తరహాలో తమిళనాడు.. ఏనుగు మృతి

కరోనా కాలంలో వణ్యచరజీవులు ప్రజల్లోకి వస్తున్నాయి. అడవిని వదిలి ఊర్లలో.. పొలాలలో సంచరిస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఓ ఆటలా వాటిపై పడి చిత్రహింసలు పెడుతున్నారు. ఆ తాకిడితో అడవి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే గతంలో కేరళలోని మల్లప్పరంలో గర్భంతో ఉన్న ఏనుగు పేలుడు పదార్ధాలు ఉన్న పైనాపిల్ తిని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత కేరళ సర్కార్ అప్రమత్తమైంది. వన్యప్రాణాలు సంచరించే ప్రాంతాల్లో నిఘాను పెంచింది. మల్లప్పరం వంటి ఘటనలు తిరిగి మరలా ఎక్కడా జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. ఏనుగు మరణానికి కారణమైన వ్యక్తులపై ఇప్పటికే కేసులు కూడా పెట్టారు. ఆ కేసుపై విచారణ కూడా కొనసాగుతుంది.

అది అలా ఉంచితే తమిళనాడులో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని జంబుకండి ప్రాంతంలో ఓ మగ ఏనుగు నోటిగాయాలతో బాధపడుతూ సోమవారం ఉదయం మృత్యవాత పడింది. నోటి గాయాలతో బాధపడుతున్న ఏనుగును రక్షించేందుకు అధికారులు, వైద్యులు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. వెదురు పొదలను తినడం వలనే ఏనుగుకు గాయాలయ్యాయని అధికారులు చెప్తున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం, పేలుడు పదార్ధాలు తినడం వలనే ఏనుగు మరణించిందని అంటున్నారు. కాగా ప్రస్తుతం కోయంబత్తూరులో ఏనుగు మరణంపై అధికారులు విచారణకు ఆదేశాసలు జారీ చేశారు. మరి ఇక్కడి ఏనుగు ఎలా మరణించింది అనేదానిపై దర్యాప్తులో తేలనుంది.