ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ టెస్లా కార్లపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ సత్తాచాటుతోంది ఆ సంస్థ. అందుకే టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలు భారత్‌కు ఎప్పుడొస్తాయా అని చాలా మంది వేచిచూస్తున్నారు. అయితే భారత దేశంలో టెస్లా వాహనాలను విడుదల చేసే విషయంపై తాజాగా ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఇండియాకు తమ సంస్థ వాహనాలను తీసుకొచ్చేందుకు ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పారు.
ప్రణయ్ అనే ఓ నెటిజన్ ట్విట్టర్లో టెస్లా హెడ్ ఎలాన్ మస్క్‌ను ఓ ప్రశ్న అడిగారు. “ఇండియాలో టెస్లా విడుదల గురించి తదుపరి అప్డేట్లు ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో లాంచ్ అయ్యే అర్హత టెస్లా కార్లకు ఉంది” అని మస్క్‌ను ఆయన ట్యాగ్ చేశారు. అయితే ఈ ప్రశ్నకు ఎలాన్ మస్క్ స్పందించారు. ఇప్పట్లో ఇండియాకు టెస్లా వాహనాలు రావనే సంకేతాలు ఇచ్చేలా సమాధానం చెప్పారు. “ప్రభుత్వంతో ఎదురవుతున్న చాలా సవాళ్లను అధిగమించేందుకు పని చేస్తున్నాం” అని ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారు.
దీంతో భారత ప్రభుత్వంతో ఇంకా చర్చలు జరుపుతున్నట్టు చెప్పకనే చెప్పారు ప్రపంచ కుబేరుడు.టెస్లా వాహనాలను భారత్‌లో లాంచ్ చేసేందుకు 2019 నుంచి ప్రయత్నిస్తున్నారు మస్క్. అయితే 100శాతం దిగుమతి సుంకం ఉండడంతో దీన్ని తగ్గించాలని టెస్లా.. భారత ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఇండియాలోనే కార్ల తయారీ ప్లాంట్ నెలకొల్పాలని మన గవర్నమెంట్.. ఆ అమెరికన్ వాహనాల తయారీ సంస్థకు చెప్పింది.
అయితే ముందుగా తమ కార్లకు భారత్‌లో సేల్స్ ఎలా ఉంటాయో గమనించి.. ఆ తర్వాత తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని టెస్లా చెబుతోంది. అందుకోసం ముందుగా దిగుమతి సుంకం తగ్గించాలని కోరింది. అలాగే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి సుంకం అధికంగా ఉందంటూ టెస్లా గతంలోనూ అభిప్రాయపడింది.
కాగా, ఎలక్ర్టిక్ వాహనాల తయారీ సంస్థలకు PLI పథకం కింద సబ్సిడీలు ఇస్తున్నామని, ఒకవేళ టెస్లా కూడా భారత్‌తో తయారీ ప్లాంట్ నెలకొల్పితే దానికి కూడా వర్తిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ అమెరికా కంపెనీ ఇక్కడే వాహనాలను ఉత్పత్తి చేయాలని పేర్కొంటున్నాయి.
మోడల్ 3 సెడాన్‌ను భారత్‌కు తీసుకురావాలని టెస్లా ఆలోచిస్తోంది. అయితే ఇక్కడి ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గిస్తుందేమోనని చర్చలు సాగిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా పన్నులపై మస్క్ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా అసంతృప్తిగా ఉందని అధికార వర్గాల సమాచారం. మరి టెస్లా కార్లు భారత రోడ్లపైకి ఎప్పుడొస్తాయో చూడాలి.