శ్రీనగర్‌లోని దాన్మర్ ప్రాంతం శుక్రవారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా దళాలకు మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది గాయపడగా.. ఆస్పత్రికి తరలించారు.
పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఆల్మదార్ కాలనీలో కార్డాన్ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాగా, మృతి చెందిన ఉగ్రవాదులిద్దరూ స్థానికులేనని, వీళ్లు లష్కరే తాయిబా ఉగ్రసంస్థకు చెందిన వాళ్లని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ధృవీకరించారు.
ఎన్కౌంటర్ ముగిసినట్లు ప్రకటించకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో తనిఖీలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 78 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టినట్లు విజయ్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే పుల్వామాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా కమాండర్ అయిజాజ్‌తో పాటు గుర్తు తెలియని మరో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరు ఉగ్రవాదుల ఐడెంటిటీ తెలియాల్సి ఉంది.