ఇంట్లోవాళ్లకు దూరంగా హాస్టల్లో ఉండలేక, ఆపై చదువు ఒత్తిడి తట్టుకోలేక ఇంజినీరింగ్ విద్యార్థిని తెలుగుగంగ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తొట్టంబేడు మండలం కారాకొల్లు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె చైతన్య శనివారం శివనాథపాలెం వద్ద కాలువలో దూకింది. ఆమె మృతదేహాన్ని ఆదివారం గుర్తించారు. ఎస్ఐ రాఘవేంద్ర కథనం మేరకు.. చైతన్య నెల్లూరు జిల్లాలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం ఈసీఈ చదువుతోంది. హాస్టల్లో ఉంటోంది. ఇంటిపై ప్రేమ, చదువు ఒత్తిడి, హాస్టల్లో వసతుల కొరతతో ఉండలేనని పలుమార్లు తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
‘లేదమ్మా.. ఈ ఏడాది అక్కడే ఉండి చదువుకో.. హాస్టల్‌కు రూ.50 వేలు చెల్లించా..’ అని తండ్రి నచ్చజెప్పాడు. ఈ క్రమంలో చైతన్య శుక్రవారం ఇంటికి వచ్చింది. శనివారం నూతన సంవత్సరం సందర్భగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లొచ్చింది. కళాశాలకు వెళ్లనని మళ్లీ చెప్పడంతో తల్లిదండ్రులు సర్దిచెప్పారు.దీంతో మనస్తాపం చెందిన చైతన్య శివనాథపాలెం వద్ద తెలుగుగంగ కాలువ ఒడ్డున సెల్‌ఫోన్‌ను పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
బీడీకాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఆ సెల్‌ఫోన్ దొరకడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు శనివారం రాత్రంతా మృతదేహం కోసం గాలించినా లభ్యం కాలేదు. శివానాథపాలేనికి సమీపంలో ఆదివారం చైతన్య మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.