ఆసీస్ ని మట్టికరిపించిన ఇంగ్లాండ్ 

England who mowed the Aussies

యాషెస్‌ మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. మొన్న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో అద్వితీయ పోరాటంతో తన జట్టు గెలిచేలా చేసిన బెన్‌స్టోక్స్‌ నేడు ఆసీస్‌తో జరిగిన యాషెస్‌ మూడో టెస్ట్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ (135*)ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లిష్‌ జట్టు 9 వికెట్లను కోల్పోయి 362 పరుగులు చేసి గెలిచింది. 156/3 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌.. ఆరంభంలోనే నాలుగో వికెట్‌ రూపంలో రూట్‌(77) పెవిలియన్‌కు చేరాడు.

అనంతరం వచ్చిన బెయిర్‌ స్టో(36) ఫర్వాలేదనిపించినా.. బట్లర్‌(1), క్రిస్‌ వోక్స్‌(1) విఫలమయ్యారు. ఈ క్రమంలో స్టోక్స్‌ ఒక్కడే నిలబడి ఆర్చర్‌(15) సాయంతో పరుగులు రాబట్టాడు. అయితే ఆర్చర్‌ ఔట్‌ కావడంతో ఇన్నింగ్స్‌ ముగియడానికి ఇంకా ఎంతోసేపు పట్టదేమో అనిపించింది.

ఒక దశలో జాక్‌ లీచ్‌(1*) సాయంతో స్టోక్స్‌ పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి జట్టును గెలిపించాడు. ఆసీస్‌ బౌలర్లలో హేజిల్‌వుడ్‌ 4, లియోన్‌ 2, కమిన్స్‌, పాటిన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 179 పరుగులు చేయగా ఇంగ్లాండ్‌ 67 పరుగులకే కుప్పకూలింది.

రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 246 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఇంగ్లాండ్‌కు 359 పరుగుల భారీ స్కోరును లక్ష్యంగా నిర్దేశించింది. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో ఆసీస్‌ గెలవగా రెండో టెస్ట్‌ వర్షార్పణం అయింది. మూడో టెస్ట్‌ను ఇంగ్లాండ్‌ గెలిచి సిరీస్‌ను సమం చేసింది. నాలుగో టెస్ట్‌ మాంచెస్టర్‌ వేదికగా వచ్చే నెల నాలుగో తేదీ ప్రారంభమవుతుంది.