తొందర పడ్డ కేసీఆర్ స‌ర్కారు

తొందర పడ్డ కేసీఆర్ స‌ర్కారు

అనుకున్న‌దే అయింది. కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్లే తెలంగాణ ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. ముందుగా ఉద‌యం 10 నుంచి మ‌రుస‌టి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్‌డౌన్ పెట్టిన ప్ర‌భుత్వం ఆ త‌ర్వాత మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు స‌డ‌లింపులు ఇవ్వ‌డం తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు బాగా త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కారు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది.

ఐతే వ్యాపారాలు స‌హా అన్ని కార్య‌క‌లాపాల‌కూ ఒకేసారి అనుమ‌తులు ఇవ్వ‌డం ప‌ట్ల భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌రోనా ముప్పు పూర్తిగా తొల‌గిపోక‌ముందే థియేట‌ర్లు, మాల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు తెరిచేయ‌డం క‌రెక్టేనా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. అన్నింటికీ మించి స్కూల్స్ వెంట‌నే పూర్తి స్థాయిలో న‌డుపుకోవ‌డానికి అనుమ‌తులు ఇవ్వ‌డం స‌రికాద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తోంది.

క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు గ‌త కొన్ని వారాల నుంచి త‌గ్గుతూ వ‌స్తుండ‌టం నిజ‌మే. కానీ ఇంకా పూర్తిగా వైరస్ ప్ర‌భావం తొలగిపోలేదు. పైగా థ‌ర్డ్ వేవ్ గురించి నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అది అనివార్యం అంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో స్కూల్స్ తెరిచి అన్ని క్లాసుల విద్యార్థుల‌కూ క్లాసులు నిర్వ‌హిస్తే ప్ర‌మాదం త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

థ‌ర్డ్ వేవ్‌లో పిల్ల‌ల‌కే ప్ర‌మాదం ఎక్కువ అనే ప్ర‌చారం కూడా ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడే స్కూల్స్ న‌డ‌ప‌డం మంచిది కాద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌నీసం ఐదో త‌ర‌గ‌తి లోపు విద్యార్థులను బ‌డుల‌కు దూరం పెట్ట‌డం మంచిద‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం ప్ర‌స్తుతానికి స్కూళ్లు మునుప‌టిలా న‌డుపుకోవ‌డానికి అనుమ‌తులు ఇచ్చినా.. కొన్ని రోజుల్లో దీనిపై వెన‌క్కి త‌గ్గి కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయొచ్చ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి.