కాంగ్రెస్ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ఇక లేరు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గురువారం వేకువ జామున కన్నమూశారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది.
కాగా, 87 ఏళ్ల వీరభద్ర సింగ్ ఏప్రిల్ 13న కరోనా బారినపడి మోహలిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యం కొనసాగుతూ వస్తోంది. కాగా, కాంగ్రెస్ తరపున తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌కు ఆయన నాలుగో ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పటి నుంచి ఆరుసార్లు దఫాలుగా సీఎంగా ఆయన సేవలందించారు.
1934 జూన్ 23న జన్మించిన వీర్‌భద్ర సింగ్.. రాజ కుటుంబంలో పుట్టారు. అందుకే జనమంతా రాజా సాహిబ్ అని ముద్దుగా పిల్చుకుంటారు. 1976 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. అంతేకాదు కేంద్ర కేబినెట్‌లోనూ పలు కీలక పదవులు అధిరోహించారు. ఆయన సతీమణి ప్రతిభా సింగ్ మండి నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యురాలిగా పని చేశారు.