సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఉండరని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా అది మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్లో ప్రస్తుతం రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఛలోతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో వరుస సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. అయితే కన్నడంలో ‘కిరాక్ పార్టీ’తో చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో తనతో జోడి కట్టిన రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరూ బ్రేకప్ అయ్యారు.
అయితే తాజాగా లీకువీరులు అందిస్తున్న సమాచారం ప్రకారం రష్మిక, రక్షిత్ శెట్టిలు మళ్లీ కలవనున్నారు. ఎందుకంటే కన్నడంలో సూపర్‌డూపర్ హిట్ సాధించిన కిరాక్ పార్టీ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టినే హీరో. అయితే హీరోయిన్గా రష్మికను కాకుండా కొత్తవాళ్లని ఎవరినైనా తీసుకోవాలని రక్షిత్ భావిస్తున్నాడట. అయితే నిర్మాతలు మాత్రం రష్మిక అయితేనే బాగుంటుందని హీరోకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కిరాక్ పార్టీ సీక్వెల్లో రక్షిత్‌తో కలిసి నటించేందుకు తనకు ఎలాంటి అభిప్రాయం లేదని రష్మిక తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక-రక్షిత్‌లో మరోసారి ఆన్‌స్క్రీన్‌పై చూడాలని అక్కడి అభిమానులు తెగ కోరుకుంటున్నారంట. మరి కిరాక్ పార్టీ సీక్వెల్ కోసం ఈ మాజీ ప్రేమికులు కలుస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.