టీఆర్ఎస్ మెడకు ఉచ్చు లా జగ్గారెడ్డి కేసు…!

Ex MLA Jagga Reddy Responds On His Arrest
మానవ అక్రమ రవాణా కేసును తెలంగాణ సర్కారు తిరగదోడిన సంగతి తెలిసిందే. 14 ఏళ్ల నాటి ఈ కేసును తిరగదోడి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని తెలంగాణ సర్కారు కటకటాల వెనక్కు నెట్టింది. 13రోజులపాటు జైలులో ఉండి వచ్చిన జగ్గారెడ్డి దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. తనను ఊచలు లెక్క పెట్టేలా చేసిన కేసీఆర్ ను వదలనని శపధం చేసారు. అలాగే ఎప్పటినుంచో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీద పాస్ పోర్ట్ కుంభకోణంలో హస్తముందన్న ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు పదే పదే ఈ తరహా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి పదే పదే కేసిఆర్ మీద కూడా కేసులున్నాయి. కేసుల నుంచి రక్షణ కోసమే కేంద్రంలో బిజెపి సర్కారుకు కేసిఆర్ మద్దతు ఇస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.  అంతేకాదు మంత్రి హరీష్ రావు మీద కూడా మానవ అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అవి ఆరోపణలుగానే ఉన్నాయి తప్ప నిజ నిర్దారణ కాలేదు.
kcr
ఎప్పుడైతే జగ్గారెడ్డి మీద మానవ అక్రమ రవాణా కేసును 14 ఏండ్ల తర్వాత రీఓపెన్ చేశారో ఆనాటి పరిణామాలన్నీ చర్చకొస్తున్నాయి. జగ్గారెడ్డి జైలు పాలైన తర్వాత మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 27వ తేదీ, ఏప్రిల్ నెల 2007 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో ‘‘అందరూ దొంగలే’’ అనే హెడ్డింగ్ తో అచ్చయిన ఒక వార్తా కథనం సంచలన విషయాలను వెల్లడిస్తున్నది. మూసి టివి అనే వార్తా సంస్థ జర్నలిస్టు పిట్టల శ్రీశైలం 14 ఏళ్ల క్రితం నాటి పత్రికా కథనాన్ని విడుదల చేశారు. 2007లో ప్రచురితం అయిన ఈ కధనం టిఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలంతా ఈ పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇరుక్కుపోయారని, ప్రత్యక్ష సంబంధాలున్నాయని పేర్కొంది. పార్టీ అధినేత మొదలుకొని కింది స్థాయి నాయకులంతా ఇన్వాల్వ్ అయినట్లు కథనంలో పేర్కొన్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి తన భార్యాపిల్లలను కాదని పరాయి భార్యా పిల్లలను కిరాయి కోసం అమెరికా తరలించారని టిఆర్ఎస్ నేతలు బలంగా ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితులున్నాయి. కానీ ఆరోజుల్లో ఇదే తరహా కార్యకలాపం తన్నీరు హరీష్ రావు కూడా చేపట్టారని ఆ కథనంలో పేర్కొనబడి ఉంది.
jangareddy-arrest
హరీష్ రావుతో పాటు ఇప్పటి జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కాశిపేట లింగయ్య, అప్పటి కేంద్ర మంత్రి, దివంగత నేత ఆలే నరేంద్ర, అప్పటి ఎంపి రవీంద్ర నాయక్ పేర్లు కూడా ఉన్నట్లు పత్రికా కథనంలో పేర్కొన్నారు. పాస్ పోర్ట్ ఏజెంట్ రషీద్ ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి అని, అతడు ఆ సమయంలో పరారీలో ఉన్నట్లు కథనంలో పొందుపరిచారు. రషీద్ ను పట్టుకుంటేనే అసలు వివరాలు వెల్లడవుతాయని కథనంలో వివరించారు.  ఈ వాదనకు తాజాగా రేవంత్ రెడ్డి కేసీఆర్ పీయే అజిత్ రెడ్డితో చానల్ లైవ్ లో మాట్లాడిన విషయాలు కూడా ఊతం ఇస్తున్నాయి. అయితే ఒక నేతను ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ సర్కారు బయటకు తెచ్చిన ఈ కేసు మొత్తం టీఆరెస్ ఉనికికే ప్రమాదకరంగా తయారయ్యింది.