ఉగ్ర‌వాదులంటే నాకిష్టం… వారికి నేనంటే ఇష్టం

Pervez Musharraf comments on Lashkar E Taiba leader Hafiz Saeed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగ్ర‌వాదిగా గుర్తింపు పొందిన వ్య‌క్తంటే ఇష్ట‌మ‌ని, ఏ దేశ అధ్య‌క్షులు గానీ, మాజీ అధ్య‌క్షులు గానీ చెప్పే సాహ‌సం చేస్తారా… ఒక వేళ మ‌న‌సులో ఇష్టం ఉన్నా… మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని ఉన్నా… ప‌రోక్షంగా అలా వ్య‌వ‌హ‌రిస్తారు త‌ప్ప ఉగ్ర‌వాదులంటే త‌మకిష్ట‌మ‌ని చెప్పే సాహ‌సం ఎవ‌రూ చేయ‌రు. కానీ అన్నింట్లోనూ భిన్నంగా వ్య‌వ‌హ‌రించే పాకిస్థాన్ పాల‌కులు మాత్రం చాలా ధైర్యంగా ప్ర‌పంచానికి త‌మ ఉద్దేశాలు వెల్ల‌డిచేస్తుంటారు. ఏం చేసినా, ఎలా మాట్లాడినా మ‌ద్ద‌తిచ్చే చైనా అండ చూసుకునో లేక ప్ర‌పంచ పెద్ద‌న్న అమెరికా ప‌రోక్ష స‌హ‌కారంపై ఉండే ధీమానో తెలియదు కానీ… ఉగ్ర‌వాదుల‌కు బాహాటంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంటారు అక్కడి పాల‌కులు. అయితే వారంద‌రి క‌న్నా రెండాకులు ఎక్కువే చ‌దివారు పాక్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముషార‌ఫ్.

Pervez Musharraf comments on Lashkar E Taiba

పాకిస్థాన్ లోని ఆరి టీవీకిచ్చిన ఇంట‌ర్వ్యూలో ముషార‌ఫ్ సంచ‌ల‌నాత్మ‌క వ్యాఖ్య‌లు చేశారు. నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాకు తాను అతిపెద్ద మ‌ద్ద‌తుదారిన‌ని ముషారఫ్ వ్యాఖ్యానించారు. జామాత్ ఉద్ దవా వ్యవ‌స్థాప‌కుడు, ల‌ష్క‌రే తోయిబా ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన హ‌ఫీజ్ సయీద్ అంటే త‌న‌కు ఎంతో ప్రేమ‌ని తెలిపారు. ఆ ప్రేమ‌కు గ‌ల కార‌ణాన్ని కూడా ముషార‌ఫ్ వెల్ల‌డించారు. క‌శ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవ‌డం వ‌ల్లే అత‌న్ని అభిమానిస్తున్నానని చెప్పారు. ల‌ష్క‌రే పై 2002లో నిషేధం విధించడం గురించి మాట్లాడుతూ అప్ప‌టి ప‌రిస్థితులు మ‌రోలా ఉండ‌డంతో తామే ల‌ష్క‌ర్ పై నిషేధం విధించామ‌ని, నిజం చెప్పాలంటే… అప్పుడు సయీద్ గురించి అంత‌గా తెలీద‌ని ముషార‌ఫ్ వ్యాఖ్యానించారు. తానెప్పుడూ కాశ్మీర్ పై చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని, స‌యీద్ కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవ‌డంతో అభిమానిగా మారాన‌ని తెలిపారు. క‌శ్మీర్ వేర్పాటు వాదుల‌కు స‌యీద్ ఎంతో స‌హ‌కారం అందిస్తున్నాడ‌ని, ఆ ప్రాంతంలో ఉగ్ర‌దాడుల‌కు, జీహాద్ కు ఊతంగా ఉన్నాడ‌ని ప్ర‌శంసించారు.

Lashkar E Taiba leader Hafiz Saeed

భార‌త్ నుంచి కాశ్మీర్ ను వేరుచేయడానికి ప్ర‌య‌త్నిస్తున్న జ‌మాత్ ఉద్ ద‌వా, ల‌ష్క‌రే తోయిబాల‌ను తాను పూర్తిగా స‌మ‌ర్థిస్తున్నాన‌ని తెలిపారు. అలాగే ల‌ష్క‌రేతోయిబాకూ తానంటే అభిమాన‌మ‌ని, ఆ సంగ‌తి త‌న‌కు తెలుస‌ని ముషార‌ఫ్ చెప్పారు. జ‌మ్మూకాశ్మీర్ పై సైనిక చ‌ర్య‌కు తానెప్పుడూ అనుకూలంగానే ఉంటాన‌ని ముషార‌ఫ్ అన్నారు. అయితే భార‌త సైన్యం చాలా శ‌క్తిమంత‌మైన‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికా సాయంతో ల‌ష్క‌రే తోయిబాను ఉగ్ర‌వాద సంస్థ‌గా ప్ర‌క‌టించ‌డంలో భార‌త్ స‌ఫ‌ల‌మైంద‌న్నారు. వీటితో పాటు ఇంట‌ర్వ్యూ చివ‌రిలో ముషార‌ఫ్ మ‌రికొన్ని హాస్యాస్ప‌ద వ్యాఖ్య‌లూ చేశారు. తాను ఉదార‌వాదిన‌ని, ఆధునిక భావాలు క‌ల‌వాడిన‌ని చెప్పుకొచ్చారు. దీన‌ర్థం మ‌త‌పెద్ద‌ల‌కు వ్య‌తిరేకం కాద‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు విన్న త‌ర్వాత టీవీ యాంక‌ర్ సైతం ముషార‌ఫ్ వంక ఆశ్చ‌ర్య‌పోతూ చూశారు.