Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లైవ్ లో స్పెషల్ ప్రోగ్రాం చేస్తున్న ఇద్దరు యాంకర్లకు ఓ స్పెషల్ గెస్ట్ సడెన్ సర్ ప్రయిజ్ ఇచ్చింది. ఫిమేల్ యాంకర్ కు ఆ స్పెషల్ గెస్ట్ ఇచ్చిన సర్ ప్రయిజ్ చూసి మేల్ యాంకర్ పడీ పడీ నవ్వాడు. అమెరికాలోని శాన్ డియాగోలోని కెఎఫ్ ఎంబీ చానల్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ స్పెషల్ గెస్ట్ ను, అది చేసిన పనిని చూసి నెటిజన్లు మనసారా నవ్వుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే… కెఎఫ్ఎంబీ చానల్ లో యాంకర్ మెడినా… తన కో యాంకర్ ఎర్రిక్ కహెనర్ట్ తో కలిసి జూడే గురించి లైవ్ లో మాట్లాడుతోంది… మెడినా మాట్లాడుతుండగానే… ఓ పక్షి వచ్చి మెడినా తలపై వాలి కొద్దిసేపు అలానే ఉంది. సడన్ గా పక్షి వచ్చి అలా వాలడం చూసిన కో యాంకర్ ఎర్రిక్ కు నవ్వాగలేదు. ఆ పక్షిని చూస్తూ పడీపడీ నవ్వాడు. మెడినా మాత్రం ఎలాంటి కంగారూ లేకుండా ప్రశాంతంగా నవ్వుతూ కూర్చుంది.
కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి మెడినా తలపైనుంచి లేచి ఎర్రిక్ పై వాలబోయింది. కానీ ఎర్రిక్ అప్రమత్తంగా ఉండడంతో వెంటనే ఎగిరిపోయింది. అసలు న్యూస్ ప్రసారమయ్యే గదిలోకి పక్షి ఎలా వచ్చిందన్న సందేహం వస్తోందా… నిజానికి చానల్ నిర్వాహకులే ఆ పక్షిని తీసుకువచ్చారు. జూడే సందర్భంగా పక్షుల గురించిన ప్రత్యేకకార్యక్రమం కోసం ఐబిస్ జాతికి చెందిన ఎరుపురంగు పక్షిని తీసుకొచ్చారు. లైవ్ లో తనను చూపించేదాకా ఎందుకు ఆగడం అనుకుందో ఏమో ఆ పక్షి తానంతట తానే ఎగురుతూ యాంకర్ దగ్గరకు వచ్చి… ఎంచక్కా తలపై వాలి కూర్చుని… కాసేపు ప్రేక్షకులకు కనిపించి మళ్లీ ఎగిరిపోయిందన్నమాట.