గతేడాది వరుస వివాదాల్లో చిక్కుకున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఆకా మెటాకి షాక్ తగిలింది. క్యూ 4కి సంబంధించి తాజాగా ఫేస్బుక్ వెలువరించిన అంచనాల్లో లాభాలకు కోత పడింది. అంతేకాదు రోజువారీ ఫేస్బుక్ యూజర్ల సంఖ్య కూడా తగ్గిపోతున్న నిజం బట్టబయలైంది. ఫేస్బుక్ ఉన్న అసంఖ్యాక యూజర్లు, లక్షల కోట్ల లాభాల్లో ఈ తరుగు స్వల్పమే అయినా మరబోతున్న పరిస్థితికి ఈ మార్పులు ఏమైనా హింట్ ఇస్తున్నాయా? అనే ఆలోచనలో పడింది టాప్ మేనేజ్మెంట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.95 బిలియన్ల మంది డైలీ యూజర్లు ఉన్నట్టుగా క్రితం త్రైమాసికం ఫలితాల్లో ఫేస్బుక్ ప్రకటించింది. క్యూ 4 అంచనాల్లో యూజర్ల సంఖ్య 1.95 బిలియన్లుగా ఫేస్బుక్ పేర్కొంది. సుమారు రెండు మిలియన్ల మంది డెయిలీ యూజర్లను ఫేస్బుక్ కోల్పోయింది. ఇక ఈ త్రైమాసికంలో 33.67 బిలియన్ల టర్నోవర్‌పై 10 బిలియన్లు లాభాన్ని ఆర్జించబోతున్నట్టు తెలిపింది. అయితే క్యూ 3 లాభాలతో పోల్చితే 8 శాతం తరుగుదల కనిపిస్తోంది.
జుకర్‌బర్గ్ ఆధీనంలో ఉన్న ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వస్తోన్న కంటెంట్‌పై 2021 ద్వితీయర్థంలో అమెరికా సెనెట్‌లో తీవ్ర దుమారం చెలరేగింది. హౌగెస అనే విజిల్ బ్లోయర్ పోరాటం చేసింది. మరోవైపు సోషల్‌మీడియాలో మిగిలిన కంపెనీలు కూడా ఫేస్‌బుక్‌కి పోటీగా కంటెంట్‌ను అందివ్వడం మొదలెట్టాయి. దీంతో డైలీ యూజర్లు, లాభాల్లో కోత పడింది. మరోవైపు ఫేస్‌బుక్‌ని మెటా పరిధిలోకి తెచ్చారు జుకర్‌బర్గ్.