గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్ పటేల్ తన వ్యాఖ్యలతో రాజకీయ కాక పుట్టించారు. రాష్ట్ర పార్టీ నాయకులు తనను వేధిస్తున్నారని, తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ అధిష్టానం కూడా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు. రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ఖొదాల్దమ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్‌ను పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ పరిణామాలతో హార్దిక్ పటేల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘‘2017లో మీరు హార్దిక్‌ని ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి మీకు నరేష్ కావాల్సి వచ్చారు. 2027లో మరో పాటిదార్ నాయకుడు కోసం చూస్తారు. హార్దిక్ పటేల్‌నే శక్తిమంతుడిగా మీరు తయారు చెయ్యలేరా?’’ అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించారు.