దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డు ప్లెసిస్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తన భార్య ఇమరి వెస్సెర్ గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చిన్నారికి జో డూ ప్లెసిస్ అని నామకరణం చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భార్యతో ఉన్న ఫొటో షేర్ చేసిన ఈ మాజీ కెప్టెన్..‘‘ఈ అద్భుతమైన ప్రపంచంలోకి నీకు స్వాగతం జో. నిన్ను మేమెంతగానో ప్రేమిస్తున్నాం. నీకు రక్షణగా నిలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను. లవ్ యూ’’ అంటూ భావోద్వేగ సందేశాన్ని జతచేశాడు.
దీంతో డు ప్లెసిస్, ఇమరి దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా డు ప్లెసిస్ తన చిరకాల ప్రేయసి ఇమరి వెస్సెర్ను 2013లో పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు 2017లో తొలి సంతానంగా కుమార్తె ఎమిలీ జన్మించింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డు ప్లెసిస్ చిన్నారి రాక నేపథ్యంలో ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో దుబాయ్ వేదికగా జరుగనున్న ఐపీఎల్ ఈవెంట్లో కాస్త ఆలస్యంగా జట్టుతో చేరనున్నాడు.