టీ20 ప్రపంచకప్-2021 తుది దశకు చేరుకుంది. నవంబర్10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్, 11వ తేదీన పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు నవంబర్ 14న మెగా ఫైనల్‌లో తలపడనున్నాయి. అయితే సెమిస్‌కు చేరిన నాలుగు జట్లులో ఏ జట్టు టైటిల్ ఫేవరేట్‌గా నిలుస్తోందో క్రికెట్ నిపుణులు, మాజీలు, స్టార్ క్రికెటర్‌లు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 ట్రోఫిని పాకిస్తాన్ కైవసం చేసుకుంటుందని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ జోస్యం చెప్పాడు.
న్యూజిలాండ్ జట్టుకు కూడా ట్రోఫీ గెలవగల సత్తా ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శనపై డుప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ అత్యుత్తమమని అతడు కొనియాడాడు. ఈ టోర్నీ సూపర్12లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అయినప్పటికీ సెమిస్‌కు ఆర్హత సాధించలేకపోయింది.
“పాకిస్తాన్ ఈసారి టైటిల్ ఫేవరేట్, కానీ న్యూజిలాండ్ అన్ని విధాలుగా ప్రత్యర్థి జట్టుకు గట్టి పోటీ ఇస్తుంది. న్యూజిలాండ్ గతంలో ఐసీసీ ట్రోఫిని తృటిలో చేజార్చకుంది. కాబట్టి వారు కూడా టైటిల్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మా జట్టు టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ టోర్నమెంట్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు” అని ఓ ఇంటర్వ్యూలో డుప్లెసిస్ పేర్కొన్నాడు.
ఇక ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పటికీ టీ20 ప్రపంచకప్ జట్టులో దక్కలేదు. దీనిపై స్పందించిన డు ప్లెసిస్ మాట్లడూతూ.. “అది నా చేతుల్లో లేదు. అది అంతా సెలక్షన్ కమిటీ చేతుల్లో ఉంటుంది. కానీ నాకు ముందే తెలుసు టీ 20 ప్రపంచకప్‌కు ఎంపిక కాను అని.. ఎందుకంటే శ్రీలంక టూర్‌కు ఎంపిక కానప్పడే అది నేను ఊహించాను” అని అతడు పేర్కొన్నాడు.