మన దేశంలో డాక్టర్ల కన్నా బాబాలు, మంత్రగాళ్లకే డిమాండ్ ఎక్కువ. అయితే దేవుని పేరుతో జనాలకు కుచ్చుటోపి పెట్టే దొంగ బాబాలకు కూడా కరువు లేదు. తాజాగా మాయమాటలతో అమాయక జనాల్ని దోచేస్తున్న దొంగబాబాను కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని దుర్శేడ్ గ్రామానికి చెందిన గంధం రమేష్ అనే బుడిగజంగం కులానికి చెందిన వ్యక్తి పూజలు చేస్తా.. ఆరోగ్య సమస్యలు తీరుస్తా అంటూ జనాలకు కల్లబొల్లి మాటలు చెప్పాడు.
కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానంటూ అమాయక ప్రజలను నమ్మించి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. తాజాగా నగరంలోని ఎస్బీఐ బ్యాంకులో పరిచయమైన ఒక సెక్యూరిటీ గార్డుకు ఉన్న సమస్యలు గుర్తించిన దొంగబాబా.. పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పాడు. దీంతో సెక్యూరిటీ గార్డు అతని మాటలు నమ్మాడు. వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పూజలు, హోమం చేయాల్సి ఉంటుందని చెప్పి అతని నుండి భారీగా డబ్బులు గుంజాడు. పలు సార్లు పూజల పేరుతో సెక్యూరిటీ వద్ద నుంచి దాదాపు రూ. 2,00,116 తీసుకున్నాడు.
ఆ తర్వాత అతడు తప్పించుకు తిరుగుతుండటంతో మోస పోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు రూరల్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతుండగా, మరింత మంది అతని దగ్గర మోసపోయినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి అతన్ని పట్టుకున్నారు.