పూణేలో భారీస్థాయిలో నకిలీ నోట్లు ప్రింటింగ్… పోలీసులు షాక్..

money

మహారాష్ట్రలో ఓ పక్క కరోనా విలయతాండవం చేస్తుంటే.. మరో పక్క అక్రమాల ముఠా మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వారి పని వారు కానిచ్చేస్తున్నారు. మహరాష్ట్రలోని పుణేలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పోలీసులు వారిపై దాడి చేసిన ఆ రాకెట్ గుట్టును విప్పారు. కోట్లాది రూపాయల విలువైన స్వదేశీ, విదేశీ కరెన్సీని చూసి పోలీసు ఉన్నతాధికారులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అందుకు సంబంధించి ఆర్మీ సిబ్బందితో పాటు ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

అయితే సదరన్ కమాండ్ ఇంటెలిజెన్స్ వింగ్, పూణె క్రైం బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో తాజాగా ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ క్రైమ్ బచ్చన్ సింగ్ తెలిపారు. అలాగే.. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో నిర్వహించిన దాడిలో ఒక జవానుతో పాటు మరికొందరు దొంగ నోట్లను ముద్రిస్తున్నారని వెల్లడించారు. వీటిలో వెయ్యి రూపాయల నోట్లు తప్ప మిగతా రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీ ఉన్నట్టు స్పష్టం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారనీ తెలుస్తోంది. కాగా అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించామని అధికారులు వివరించారు.

కాగా అరెస్టైన ఆరుగురిలో భారత ఆర్మీ జవాన్ షేక్ అలీమ్ గులాబ్ ఖాన్, సునీల్ బద్రీనారాయణ సర్దా, రితేష్ రత్నాకర్, తుఫైల్ అహ్మద్ మహ్మద్ ఖాన్, రెహ్ముతుల్లా ఖాన్, అబ్దుల్ రెహమాన్ ఖాన్ అని పూణే సంయుక్త పోలీసు కమిషనర్ రవీంద్ర షిస్వే ఉన్నారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో వీరు ముద్రణ చేస్తున్నారు. వీటిలో 2016లో కేంద్రం రద్దు చేసిన పెద్ద నోట్లు కూడా ఉన్నాయి. ఈ నకిలీ నోట్ల కట్టల్లో మొదటి నోటు మాత్రమే అసలిదిగా ఉంటుందని అన్నారు. అలాగే.. ఒక నకిలీ పిస్తోల్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉంది.