భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి దిశగా అడుగులు..

Army daring surgical Strike Marks Radical Change In India Pakistan

గత కొంత కాలంగా భారత్, చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ తూర్పు లడఖ్‌లో సైనిక ఉద్రిక్తతలను ముగింపు పలికేందుకు భారత్‌, చైనా తాజాగా మరోసారి చర్చలు జరిపాయి. మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సానుకూల వాతావరణంలో ఫలప్రదంగా చర్చలు సాగినట్లు సీనియర్‌ సైనికాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌నాటి యథాతథ స్థితిని పునరుద్ధరించడంతోపాటు, సరిహద్దుల నుంచి తక్షణమే చైనా తన బలగాలను ఉపసంహరించుకోవాలని భారత్‌ బృందం డిమాండ్‌ వెల్లడించింది.

అదేవిధంగా ఈ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో రెండు దేశాలు పరిమిత సంఖ్యలో బలగాల ఉపసంహరణను ప్రారంభించిన మరుసటి రోజే ఈ చర్చలు జరిగాయి. కాగా పాంగాంగ్‌, దౌలత్‌బేగ్‌ ఓల్డీ, దెమ్‌చోక్‌లో మాత్రం బలగాలు కొనసాగుతున్నాయి. అలాగే.. సరిహద్దు సమస్యపై ఈనెల 6న ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి చర్చలు కూడా జరిపారు. ఆ చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయంతో తిరిగి సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలూ చర్యలు ప్రారంభించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ వివరించారు.