Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నకిలీ స్టాంపుల కుంభకోణం కేసు నేరస్థుడు అబ్దుల్ కరీం తెల్గీ మృతిచెందాడు. 16 ఏళ్ల క్రితం అటల్ బీహారీ వాజ్ పేయి నేతృత్వంలో ఎన్టీఏ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో అత్యంత సంచలనం సృష్టించింది రూ. 33వేల కోట్ల నకిలీ స్టాంపుల కుంభకోణం కేసు. తర్వాత యూపీఏ హయాంలో లక్షల కోట్ల స్కామ్ లు వెలుగుచూసినప్పటికీ… 2001 నాటికి రూ. 33 వేల కోట్ల కుంభకోణం అంటే ఒక్కసారిగా సంచలనం రేగింది. అంత పెద్ద మొత్తంలో ఓ భారీ నేరం వెలుగుచూడడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో అదే ప్రథమం కావటం, ఈ కుంభకోణం వెనక పాకిస్థాన్ హస్తముందని వార్తలు రావడం, కొందరు రాజకీయనాయకులు, పోలీసు అధికారులు, జర్నలిస్టుల పాత్రా వెలుగుచూడడంతో… అవినీతి సర్వవ్యాప్తమయిందన్న భావన నెలకొంది. ఇప్పట్లా వార్తా చానళ్లు అప్పుడు లేకపోయినా… ఈ కుంభకోణంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చజరిగింది.
పత్రికలు, అప్పటికి ఉన్నకొన్ని చానళ్లనిండా… ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలే కనిపించేవి. ఈ కేసు జాతీయస్థాయిలోనే కాకుండా… ప్రాంతీయంగానూ సంచలనం సృష్టించింది. కర్నాటకలో కొందరు పోలీసు అధికారులు, నాయకులు ఈ కేసు విచారణను ఎదుర్కొన్నారు. అప్పటి ముంబై పోలీస్ జాయింట్ కమిషనర్ శ్రీధర్ వగాల్ రూ. 72లక్షలను తెల్గీ నుంచి తీసుకున్నాడని విచారణలో తేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోహియాయత్ నగర్ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయాదవ్ నూ పోలీసులు అరెస్టు చేశారు. 2001లో పోలీసులకు దొరికిపోయిన తెల్గీ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. బెంగళూరు కేంద్రంగా తొమ్మిది రాష్ట్రాల్లోని 72 కేంద్రాల నుంచి నకిలీ స్టాంపులు విక్రయించాడని పోలీసుల విచారణలో తేలింది. స్టాంపు కాగితాలను ముద్రిస్తే కోట్లరూపాయలు సంపాదించవచ్చని భావించిన తెల్గీ చిన్న స్థాయిలో వాటిని ముద్రించడం ప్రారంభించి దందా విస్తరించాడు. బ్యాంకులు, స్థిరాస్థి వ్యాపారులు, బీమా సంస్థలు తదితరులకు భారీగా వాటిని విక్రయించాడు.
ఆరోపణలన్నీ రుజువు కావడంతో… 2006లో తెల్గీకి బెంగళూరు న్యాయస్థానం 43 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అరెస్టయిన దగ్గరనుంచి తెల్గీ పరప్పన అగ్రహార కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అవయవ వైఫల్యాలతో బాధపడుతూ సోమవారం బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించి మరణించాడు. తెల్గీ 20 ఏళ్లగా బీపీ, షుగర్ తో బాధపడుతున్నాడు. 2001లో హెచ్ ఐవీ కూడా సోకిందని వైద్యులు అప్పట్లో ధృవీకరించారు. అయితే నకిలీ స్టాంపుల కేసు విచారణ సమయంలో పోలీసులే తెల్గీకి హెచ్ఐవీ వైరస్ ఎక్కించారన్న ఆరోపణలున్నాయి. ఒకప్పుడు దేశాన్ని ఓ కుదుపు కుదిపిన నేరానికి ఒడిగట్టిన తెల్గీ విక్టోరియా ఆస్పత్రిలో అనామకుడిగా కన్నుమూశాడు.