కుమార్తె కులాంతర ప్రేమ వివాహం ఓ కుటుంబాన్ని కబళించింది. అవమానానికి గురైన ఆ కుటుంబ పెద్ద తన కుటుంబ సభ్యులను కడతేర్చి తాను ఆత్మహత్య చేసుకున్న దారుణ ఉదంతం నాగపట్టినం జిల్లాలో చోటు చేసుకుంది. విక్కనాపురానికి చెందిన లక్ష్మణన్ , భువనేశ్వరి దంపతులకు కుమార్తెలు ధనలక్ష్మి, వినోదిని, అక్షయ ఉన్నారు. ఇంటి ముందు ఓ టీ బంకు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
పెద్ద కుమార్తె ధనలక్షి అదే ప్రాంతంలోని వేరే సామాజికవర్గానికి చెందిన విమల్‌రాజ్ ను ప్రేమించగా లక్ష్మణన్ అభ్యంతరం తెలిపాడు. దీంతో మూడు నెలల క్రితం ధనలక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయి విమల్‌రాజ్‌ను పెళ్లి చేసుకుంది. దీంతో తీవ్రమనస్తానికి గురైన లక్ష్మణన్ టీ దుకాణం నడపకుండా ఇంటి పట్టునే ఉండేవాడు.
తెల్లవారుజామున 4 గంటలకే టీ బంకు తెరిచే లక్ష్మణన్ శుక్రవారం ఉదయం 7 గంటలైనా తెరవకపోగా ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో స్థానికులు అనుమానంతో ఇంటిలోకి చూడగా భార్య, ఇద్దరు కుమార్తెలు రోకలి బండతో తలపై మోది హత్యకు గురైన స్థితిలో, లక్ష్మణన్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుమార్తె ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేక కుటుంబ పెద్దే భార్య, ఇద్దరు కుమార్తెలను హతమార్చి తాను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.