నలుగురు దారుణ హత్య

నలుగురు దారుణ హత్య

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో ఓ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురయ్యారు. పదహారేళ్ల బాలిక, పదేళ్లు బాలుడు సహా భార్యభర్తలను పదునైన ఆయుధాలతో దాడిచేసి హత్యచేశారు. హత్యకు ముందు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్టు కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం దళితులు కాగా.. వీరి ఇంటి పొరుగున ఉన్న అగ్రవర్ణాలకు చెందినవారే హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.

భర్త, భార్య , కుమారుడు మృతదేహాలు బయటపడి ఉండగా.. బాలిక ఇంట్లోని ఓ గదిలో విగతజీవిగా పడి ఉంది. పొరుగున ఉన్న అగ్రవర్ణాల కుటుంబంతో 2019 నుంచి భూవివాదం కొనసాగుతోందని, వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని బాధిత కుటుంబం పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబరులో ఒకసారి దాడికి పాల్పడ్డారని తెలిపారు. మరోవైపు, బలవంతంగా రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.

‘‘దాడి తర్వాత హత్యకు గురైన వారితో పోలీసులు రాజీ చేసుకోవాలని బలవంతం చేశారు.. సుశీల్ కుమార్  మా దగ్గరకు వచ్చి రాజీకి ఒత్తిడి చేసేవాడు. పోలీసులు వారి ఇళ్ల వద్ద కూర్చునేవారు.. స్థానిక ఇన్‌స్పెక్టర్ కూడా రాజీకి ప్రయత్నించారు… సెప్టెంబరు 21న దాడికి పాల్పడితే వారం తర్వాత మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది.. బాధిత కుటుంబంపై కూడా కౌంటర్ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు’’ అని బాధిత కుటుంబానికి చెందిన బంధువు పేర్కొన్నారు.

కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు. మొత్తం 11 మందిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు నమోదయ్యిందని తెలిపారు. కొందర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ప్రయాగ్‌రాజ్ పోలీస్ చీఫ్ పేర్కొన్నారు.

‘‘నలుగురికీ తలపై గొడ్డలితో దాడిచేసినట్టు ఆనవాళ్లున్నాయి.. వారి మృతదేహాలపై బలమైన గాయాలున్నాయి.. ప్రాథమిక సమాచారం ప్రకారం 2019, 2021లో భూ వివాదం విషయంలో నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశాం.. కుటుంబీకులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పోలీస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠీ వెల్లడించారు.

అటు బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించనున్నారు. వారిని కలుసుకుని అండగా నిలబడతామని హామీ ఇవ్వనున్నారు.