బాలీవుడ్‌కు ఈ ఏడాది అస్సలు బాగోలేదు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ వంటి స్టార్లను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడటం ఊహించని విషాదం. ఈ మధ్యే బాలీవుడ్ సినీ, టీవీ నటుడు రాజన్ సెహగల్, ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ కూడా కన్నుమూశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రాజత్ ముఖర్జీ మరణించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని నటుడు మనోజ్ భాజ్‌పాయ్ అన్నారు. మరోవైపు ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ‘రోడ్’ సినిమా.. రాజత్ ముఖర్జీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. వీటితోపాటు ప్యార్ తునే క్యా కియా, లవ్ ఇన్ నేపాల్, ఇష్క్ కిల్స్ సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.