హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ

హీరో సిద్ధార్థ్‌కు సర్జరీ

హీరో సిద్ధార్థ్‌కు లండన్‌లో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించిన సిద్ధార్థ్‌కు ఆ తర్వాత ఆశించిన సక్సెస్‌ రాలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ సెటిలైపోయాడు. ఈ క్రమంలో అక్కడ కూడా తన సినిమాలకు అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం బ్రేక్‌ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం అనంతరం ‘మహా సముద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు.

దసరా సందర్భంగా ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల మహా సముద్రం ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్‌ భూపతి, హీరో శర్వానందా, హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యయేల్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హజరయ్యారు. అయితే ఈ వేడుకలో సిద్ధార్థ్‌ మాత్రం కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్‌ ఆరా తీయగా ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఇటీవల లండన్‌ వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ సర్జరీ జరిగినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే చికిత్స ఎందుకు, దేనికి అనేది మాత్రం స్పష్టత లేదు. సోషల్‌ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకునే సిద్ధార్థ్‌ సర్జరీ విషయంపై ప్రస్తావించలేదు. అంతేగాక కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ఎలాంటి పోస్టులు షేర్‌ చేయకపోవడం గమనార్హం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే దీనిపై సిద్ధార్థ్‌ స్పందించే వరకు వేచి చూడ్సాలిందే. కాగా మహా సముద్రంలో సిద్ధార్థ్‌తో పాటు శర్వానంద్‌ కూడా హీరో నటిస్తున్నాడు.