కేంద్రమంత్రి, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దళిత నేత రామ్ విలాస్ పాశ్వాన్(74) గురువారం కన్నుమూశారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు గుండె శస్త్ర చికిత్స జరిగింది. పాశ్వాన్ మరణవార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు.
‘నాన్నా.. ఈ ప్రపంచంలో మీరు లేరు. కానీ మీరెప్పుడూ నాతోనే ఉంటారని నాకు తెలుసు. మిస్ యూ నాన్నా’ అని చిరాగ్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పాశ్వాన్.. కేంద్ర మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల బాధ్యతలు చూస్తున్నారు. పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
‘యవ్వనంలో పాశ్వాన్ ఒక ఫైర్‌బ్రాండ్ సోషలిస్ట్. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో జయప్రకాశ్ నారాయణ్ వంటి నేతల సాంగత్యంలో నాయకుడిగా ఎదిగారు’ అని కోవింద్ ట్వీట్‌చేశారు. పాశ్వాన్ మరణం తనను మాటలకందని బాధకు గురి చేసిందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కృషి, పట్టుదలతో పాశ్వాన్ రాజకీయాల్లో ఎదిగారు. యువకుడిగా ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కొన్నారు. ఆయన అద్భుతమైన మంత్రి, పార్లమెంటేరియన్.
చాలా విధాన విషయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. కేబినెట్ సమావేశాల్లో ఆయన లోతైన సూచనలు ఇచ్చేవారు. రాజకీయ జ్ఞానం, దార్శనికత, పాలనాదక్షతల్లో ఆయనకు సాటిలేరు’ అని మోదీ పేర్కొన్నారు. కేంద్రమంత్రి పాశ్వాన్ మృతికి సంతాప సూచకంగా నేడు దేశ రాజధాని ఢిల్లీలో, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేయనున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారు.