ఇంటి నిర్మాణం కోసం ఎన్ని చెట్లను నరికావో చెప్పు

ఇంటి నిర్మాణం కోసం ఎన్ని చెట్లను నరికావో చెప్పు

టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్లా పర్యటనలో ఉన్న ధోని తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు. ప్రస్తుతం సిమ్లాలో ధోని ఉన్న ఇళ్లు పూర్తిగా చెక్కతో తయారుచేశారు. ఈ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఇళ్లు చెక్కతోనే నిర్మిస్తారు.అక్కడి వాతావారణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా కనిపించిన ధోని ఫోటోలను షేర్‌ చేస్తూనే ‘చెట్లు నాటండి.. అడవులు కాపాడండి’ అంటూ మెసేజ్‌ ఇచ్చాడు.

ఈ మెసేజ్‌ ధోని అభిమానులను రెండుగా చీల్చింది. ఒక వర్గం ధోనిని పొగిడితే.. మరో వర్గం మాత్రం ధోని చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ” ఒకవైపు చెట్లను నరికి ఇల్లు కడుతున్న ధోనీ.. వేరే వాళ్లకు మాత్రం చెట్లు నాటమని సలహా ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ధోని ఆ ఇంటి నిర్మాణం కోసం ఎన్ని చెట్లను నరికావో చెప్పు” అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సీఎస్‌కే స్పందింస్తూ ‘ప్లాంటింగ్ ద రైట్ థాట్స్’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

కాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో సీఎస్‌కే జట్టును ఎంఎస్‌ ధోని విజయవంతంగా నడిపించిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ను మరిపిస్తూ చెన్నై ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి జరగనుంది. కాగా ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడుపుతున్న ధోని ఆగస్టులో సీఎస్‌కే టీంతో కలవనున్నాడు.