ఆ పాత్ర చేయోద్దంటున్న అభిమానులు

ఆ పాత్ర చేయోద్దంటున్న అభిమానులు

‘మహానటి’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది కీర్తి సురేష్. ఆ క్రేజ్‌తో కెరీర్‌ను చక్కదిద్దుకోకుండా ఆమె తప్పటడుగులు వేస్తోందనిపిస్తోంది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నా పట్టించుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఎన్నుకున్న కొన్ని కథలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. ఓటీటీలో విడుదలైన ‘పెంగ్విన్’ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా నిరాశపరిచింది. దీంతో పాటు ఆమె సినిమాలన్నీ కూడా వరుసగా ఓటీటీ వేదికలపైకి వచ్చేస్తున్నాయి. దీంతో కీర్తి సురేష్‌ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి.

ఈ టైమ్‌లోనే ఆమె తీసుకున్న నిర్ణయం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘వేదాళం’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా కథ మొత్తం హీరో చెల్లెలి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఈ పాత్ర కోసం యూనిట్ సాయిపల్లవి, కీర్తిసురేష్‌ పేర్లను పరిశీలించి చివరికి కీర్తిని ఓకే చేశారు. ఈ రోల్‌కు కీర్తి సురేష్‌ కూడా ఓకే చెప్పేయడంతో ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు.

హీరోయిన్‌గా ఎన్నో అవకాశాలు వస్తుండగా ఇప్పుడు చిరంజీవికి చెల్లెలిగా నటించేందుకు సిద్ధం కావడం వారికి రుచించడం లేదు. ఒక్కసారి చెల్లెలి పాత్రలో నటిస్తే ఇక స్టార్ హీరోలెవరూ ఆమెవైపు కన్నెత్తి చూడరని, దీంతో కెరీర్ చేజేతులా నాశనం చేసుకున్నట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతోనే కీర్తిసురేష్ ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకుందని, దీని తర్వాత ఆమెకు అవకాశాలు మరింత పెరుగుతాయని కొందరు అంటున్నారు.