వివాదంలో చిక్కుకున్న టాప్‌ ప్రొడ్యూసర్

వివాదంలో చిక్కుకున్న టాప్‌ ప్రొడ్యూసర్

బాలీవుడ్‌ టాప్‌ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌‌ సిబ్బంది గత వారం గోవాలోని ఓ గ్రామంలో షూటింగ్‌ చేశారు. ఈ క్రమంలో పోగయిన చెత్తని ఆ‌ గ్రామంలో పడేసి వెళ్లారు. ఈ ఘటన ఉత్తర గోవా నిరుల్‌లో చోటు చేసుకుంది. ప్రాంత వాసులు తమ ఏరియాలో చెత్త పడేయటాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

దాంతో ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా గోవా ప్రభుత్వం కరణ్‌ ధర్మ ప్రొడక్షన్స్‌కి నోటీసులు జారీ చేసింది. అలానే విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఎంటర్‌టైన్‌మెంట్‌ సొసైటీ ఆఫ్‌ గోవా ధర్మ ప్రొడక్షన్స్‌ లైన్‌ ప్రొడ్యూసర్‌ దిలీప్‌ బోర్కర్‌కి మంగళవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో గోవా వ్యర్థ పదార్థాల నిర్వహణ మంత్రి మైఖేల్ లోబో మాట్లాడుతూ… ‘ధర్మ ప్రొడక్షన్స్‌ సిబ్బంది ఈ స్థలంలో చెత్త పడేసి తమ దారిన తాము పోయారు. శుభ్రం చేయలేదు. ఇందుకు గాను వారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఫేస్‌బుక్‌ ద్వారా తమ తప్పును ఒప్పుకోవాలి.. క్షమాపణలు కోరాలి. లేకపోతే వారికి జరిమానా విధిస్తాం’ అని హెచ్చరించారు. ఈ చెత్తలో తారాగణం, సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లు కూడా ఉన్నాయి.

ఇక ఈ సంఘటనపై లైన్స్‌ ప్రొడ్యూసర్‌ దిలీప్‌ బోర్కర్‌ స్పందించారు. ‘మేము నిరుల్‌ ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌ చేశాం. ప్రతి రోజు చెత్తను సేకరించి స్థానిక పంచాయతీ తెలిపిన ప్రదేశంలో పడేసేవాళ్లం. కాంట్రాక్టర్‌ క్రమం తప్పకుండా చెత్తను సేకరిస్తాడు. కానీ ఆదివారం మాత్రం తీసుకెళ్లలేదు. దాంతో అది అక్కడే ఉంది. దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు అని తెలిపాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోనె ప్రధాన పాత్రలో నటించిందని సమాచారం.