“మిస్‌యూయూవీ” అంటున్న అభిమానులు

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి నేటికి ఏడాది పూర్తయినా ఇంకా అభిమానుల గుండెల్లో యువరాజుగానే ఉన్నాడు సిక్సర్ల వీరుడు యూవీ. టీమిండియాలో ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ధి చెందిన యువరాజ్ సింగ్‌ మరోమారు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచాడు. మిస్‌యూయూవీ హ్యాష్‌ట్యాగ్‌ జోడించి యువరాజ్‌ సింగ్‌పై తమకున్న అభిమానాన్ని ట్వీట్‌ల రూపంలో క్రికెట్‌ ప్రేమికులు చూపించారు. లెజెండ్‌లకు రిటైర్మెంట్‌ ఉండదని యూవీపై తమ అభిమానం శాశ్వతమైందంటూ కామెంట్లు పెడుతున్నారు.

టీమిండియాకు ఎంపికైన తర్వాత కొంత కాలం తన ముద్ర చూపిన యువీ రెండేళ్ల తర్వాత వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే పునరాగమనం తర్వాత 2002 నాట్‌వెస్ట్‌ టోర్నీ అతని కెరీర్‌ను తారాజువ్వలా పైకి లేపింది. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌కు తోడుగా అర్ధసెంచరీ చేసిన అతను… తన 71వ వన్డేలో గానీ మొదటి సెంచరీ సాధించలేకపోయాడు. 2004లో సిడ్నీ మైదానంలో ఆసీస్‌పై చెలరేగి 122 బంతుల్లో చేసిన 139 పరుగుల ఇన్నింగ్స్‌ అతని కెరీర్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనల్లో ఒకటి.

ఇక 2007లో జరిగిన తొలి టి20 ప్రపంచకప్‌లో యువీ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ ఓవర్లో ఆరు సిక్సర్లే కాదు… ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్లో 30 బంతుల్లో చేసిన 70 పరుగుల ఇన్నింగ్స్‌ అతని విలువేమిటో చూపించింది. 2010లో ఫామ్‌ కోల్పోవడం, క్రమశిక్షణ లోపం, ఫిట్‌నెస్‌ సమస్యలతో మళ్లీ అతనిపై వేటు పడినా… తక్కువ వ్యవధిలోనే తిరిగొచ్చాడు. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ప్రదర్శన యువరాజ్‌ కెరీర్‌లో కోహినూర్‌ వజ్రంగా నిలిచిపోయింది. బ్యాటింగ్‌కు తోడు అతని లెఫ్టార్మ్‌ స్పిన్‌ కూడా భారత్‌కు కీలక సమయాల్లో విజయాలు అందించింది.

ప్రపంచ కప్‌ గెలిచిన కొన్నాళ్లకే యువరాజ్‌కు క్యాన్సర్‌ ఉన్నట్లు బయటపడింది. జీవితంలో అతి పెద్ద పోరాటంగా భావిస్తూ చికిత్స పొంది కోలుకున్న అనంతరం యువీ మళ్లీ క్రికెట్‌ మైదానంలో అడుగు పెట్టడం ఒక అద్భుతం. అయితే కెరీర్‌లో ఉచ్ఛ స్థితిలో ఉన్న సమయంలో వచ్చిన క్యాన్సర్‌ తర్వాత అతని ఆట అంత గొప్పగా సాగలేదు. పోరాటానికి మారుపేరుగా నిలిచిన యువీ పలు మార్లు జట్టులోకి రావడం, పోవడం తరచుగా జరిగాయి. వన్డేల్లో ఇంగ్లండ్‌పై చేసిన 150 పరుగుల తన వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు, టి20ల్లో ఆస్ట్రేలియాపై 35 బంతుల్లోనే 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు రాలేదు. ఆ తర్వాత దేశవాళీలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త క్రికెటర్ల రాకతో అతను మెల్లగా భారత జట్టుకు దూరమయ్యాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యువీ రాజసం ఎప్పటికీ చెక్కుచెదరనిది అనడంలో సందేహమే లేదు.