భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నాడా? కుటుంబంతో సమయం గడిపేందుకు అతను కొంత విశ్రాంతి కోరుకుంటున్నాడా? లేక కొత్త కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలా? అధికారిక సమాచారం ఏమీ లేకుండానే భారత క్రికెట్‌కు సంబంధించి మరోసారి మరో అంశంపై చర్చ మొదలైంది. అతను వన్డే సిరీస్‌లో ఆడటం లేదనే వార్తలు రావడంతో మంగళవారం ఉదయం నుంచి పలు రకాల కథనాలు వినిపించాయి.సఫారీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లి విశ్రాంతి కోరుకుంటున్నాడని సమాచారం.
తనతో పాటు ప్రయాణించే భార్య, కూతురు కోసం ఆటకు కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. జనవరి 19, 21, 23 తేదీల్లో ఈ వన్డేలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. పైగా కోహ్లి ఇప్పటి వరకు విరామం విషయంలో తమకు ఎలాంటి విజ్ఞప్తీ చేయలేదని బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికైతే కోహ్లి దక్షిణాఫ్రికాతో వన్డేలు ఆడతాడని అనుకుంటున్నాం. ఇక కోహ్లి కూతురి పుట్టిన రోజైన జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో అతను మూడో టెస్టు ఆడబోతున్నాడు కాబట్టి విరామానికి అది కారణం కాకపోవచ్చు. ఈ మ్యాచ్ కోహ్లి కెరీర్లో 100వది కానుంది.