సైబర్ నేరగాళ్లు వేసిన గాలం నుంచి ఓ రైతు జాగ్రత్తగా బయటపడ్డాడు. కానీ… ఓ టెకీ మాత్రం మోసపోయి.. ఏకంగా రూ.9 లక్షలు పోగొట్టుకున్నాడు. అదెలాగంటే.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన రైతుకు ఈమధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు లండన్ లాటరీని గెలుచుకున్నారు. మీకు రూ.4 కోట్లు వచ్చాయి. మీ ఖాతా పూర్తి వివరాలు చెప్తే అందులో డబ్బు వేస్తాం’ అని తెలిపారు. వెంటనే జాగ్రత్తపడ్డ రైతు.. తనకు బ్యాంకు ఖాతానే లేదని చెప్పేశాడు. దీంతో అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశాడు.
అయితే రైతు ఆ ఫోన్ నంబర్‌ను సైబర్‌క్రైం పోలీసులకు చెప్పి విషయాన్ని స్పష్టం చేశాడు. అలాగే.. హైదరాబాద్ నాచారంలోని ఓ సంస్థకు చెందిన మేనేజర్‌కు ‘మీ ఆర్డర్ డెలివరీకి బయలుదేరింది. మా సంస్థ కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచింది. డెలివరీకి కావాల్సిన నగదును కొత్త ఖాతాలో జమచేయండి’ అని ఈ మధ్య ఓ మెయిల్ వచ్చింది. కంపెనీ పేరుతో తరచూ లావాదేవీలు నిర్వహించే ఆ మేనేజర్ ఆ మెయిల్‌ను తనిఖీ చేసుకోకుండా కొత్త ఖాతాలో రూ.9 లక్షలు జమ చేశాడు. రెండ్రోజుల తర్వాత ఆర్డర్ డెలివరీ అయ్యిందని, డబ్బులు పంపించాలని అసలు కంపెనీవారు ఫోన్ చేసి చెప్పారు. కొత్త ఖాతాలో జమ చేశామని చెప్పగా.. అలాంటి ఖాతాలు తాము తెరవలేదని స్పష్టంచేశారు. దీంతో మోసపోయినట్లు గుర్తించి వెంటనే.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ ఈ సందర్భంగా వెల్లడించారు. అక్షరాల తేడాతో మెయిల్‌ను పంపి దోచుకుంటున్నవారి బారినపడకుండా ఫిల్టర్ యాప్‌లను పెట్టుకోవాలని సూచించారు. ఇదే సమయంలో గుర్తి తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చినప్పడు మెలకువతో వ్యవహరించిన రైతును పోలీస్ అధికారులు ప్రశంసించారు.