ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మంగళవారం రబీలో నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు రూ.22 కోట్లను వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేస్తున్నామని అన్నారు. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని తెలిపారు.
62 శాతానికిపైగా మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని సీఎం జగన్ తెలిపారు. రైతులు నష్టపోకూడదని ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ చెప్పారు. ఏ సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. నష్ట పరిహారం చెల్లింపులో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. 34,586 మంది రైతుల ఖాతాల్లో రూ. 22 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. గులాబ్ తుఫాన్‌తో నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. 18 లక్షల ఎకరాల్లో 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.1,070 కోట్లు అందజేశామని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రూ.18,777 కోట్లు అందించామని చెప్పారు. సున్నా వడ్డీ ద్వారా రూ.1,674 కోట్లు అందించామని పేర్కొన్నారు.