అసెంబ్లీ వైపు ఆందోళనలు చేస్తున్న రైతులు

అసెంబ్లీ వైపు ఆందోళనలు చేస్తున్న రైతులు

ఇటీవల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్మాణం అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు రగులుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంలో ఆగ్రహించిన అమరావతి రైతులు సీఎం జగన్ కి వ్యతిరేకంగా ఆందోళన దీక్షలు చేపట్టారు. దానికి తోడు రాష్ట్ర రాజదానిపై GN రావు కమిటీ ఇచ్చిన నివేదికతో అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఇంకా ఆగ్రహిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అమరావతి, తుళ్లూరు ప్రాంతానికి చెందిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు.

అక్కడితో ఆగకుండా రైతులంతా రోడ్లపైకి వచ్చి, అసెంబ్లీ వైపు ఆందోళనలు చేస్తున్నారు. కాగా నేడు ఉదయం 8 గంటలకు మందడం లైబ్రరీ సెంటర్‌లో ఒక ధర్నా నిర్వహిస్తున్నారు. ఇకపోతే వెలగపూడి ప్రాంతంలో వరుసగా నాలుగవ రోజు రిలే నిరాహారదీక్షలు చేయడానికి రైతులు పూనుకున్నారు. దానితో పాటే తుళ్లూరులో మహాధర్నా కూడా నిర్వహించనున్నారు. ఆ తరువాత 9 గంటలకు రాయపూడిలో వంటావార్పూ కార్యక్రమం ద్వారా తమ నిరసనని వ్యక్తం చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం రాజధాని విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవాలని రైతులు ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.