లాక్డౌన్ వేళ ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మరణించగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని ఆటో ప్రమాదవశాత్తూ వెనక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈరోజు ఉదయాన్నే ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకన్నట్లు తెలుస్తోంది. కాగా లారీని ఢీకొన్న ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయింది. కాగా.. అందులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.
గుంటూరు జిల్లా ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన రాగల చిన్నబ్బాయి, రత్తమ్మ కుటుంబం గత ఐదేళ్లుగా గుంటూరు సమీపంలోని ఏటుకూరు గ్రామంలో నివాసం ఉంటోంది. గత నెల 29వ తేదీన సొంతూరైన కొచ్చెర్లలో సమీప బంధువు మరణించడంతో కుటుంబ సభ్యులు కొచ్చెర్లకు వెళ్లారు. ఈ నెల 12వ తేదీన పెద్ద కర్మ ముగించుకుని కుటుంబ సభ్యులు ఉదయాన్నే ఐదు గంటలకు ఏటుకూరు బయల్దేరారు.
సుమారు ఏడు గంటల సమయంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై చిన్నకోండ్రుపాడు వద్ద ముందు వెళ్తున్న లారీని ఆటో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఆటో వేగంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటోలో ముందు కూర్చున్న ఆటో డ్రైవర్ రాగల చిన్న అంకారావు, అతని తండ్రి చిన్నబ్బాయి ప్రాణాలు కోల్పోయారు. కాగా డ్రైవర్ భార్య గోవిందమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వెనుక కూర్చున్న రాగల రత్తమ్మ, నాగల్ల కుమారి, పిల్లలు అఖిల్ కుమార్, దివ్య, సుధారాణిల స్వల్పగాయాలతో బయటపడ్డారు. కాగా హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.