జీవితాంతం కలిసి నడవాల్సిన భర్త, అపురూపంగా పెంచుకున్న బిడ్డ..కళ్లముందే నిర్జీవంగా కనిపించారు. అప్పటివరకూ తనతో మాటలు చెప్పిన వారిద్దరూ కళ్లు తెరిచి చూసేలోపు లోకాన్ని వీడారు. దీంతో ఆ మహిళ శోకసంద్రంలో మునిగిపోయింది. తనవాళ్లను తలచుకుంటూ బోరున విలపించింది. వివరాల్లోకి వెళితే…పరుశురాముడు, భాగ్యమ్మ దంపతులు నగరంలోని ఉమానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి హేమంత్‌కుమార్, కొండప్ప సంతానం. పరుశురాముడు బేల్దారి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
మంగళవారం పరుశురాముడు, భాగ్యమ్మ, పెద్ద కుమారుడు హేమంత్‌కుమార్‌తో కలిసి పంపనూరు దేవస్థానానికి బైక్‌లో వెళ్లారు. దైవ దర్శనం అనంతరం ముగ్గురు తిరుగు ప్రయాణమయ్యారు. వీరి బైక్ కురుకుంట సమీపంలోకి రాగానే ఓ ఐచర్ వాహనం రాంగ్రూట్లో వేగంగా ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పరుశురాముడు, భాగ్యమ్మ, హేమంత్‌కుమార్ ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన పరుశురాముడు, హేమంత్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా… భాగ్యమ్మ కంటికి తీవ్రగాయమైంది.