ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తండ్రీకొడుకుల మృతి

ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తండ్రీకొడుకుల మృతి

ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హన్మకొండ నక్కలగుట్టలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సుబేదారి ఎస్సై వీరేందర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన గజ్జెల సంజీవ్‌ కుటుంబంతో కలిసి బాలసముద్రంలోని అంబేడ్కర్‌ కాలనీలో నివాసం ఉంటూ ఫొటో గ్రాఫర్‌గా జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఇటీవల ఫొటోలు తీసిన వ్యక్తి నుంచి డబ్బు తీసుకురావటానికి ఉదయం పెద్ద కొడుకు రూఫస్‌తో కలిసి బయలుదేరాడు. 8.30 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రీకొడుకును హన్మకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నక్కలగుట్టలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎదుట వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో గజ్జెల సంజీవ్‌(42), రూఫస్‌(14) అక్కడికక్కడే మృతి చెందారు.

బతుకుదెరువు కోసం హన్మకొండకు వచ్చిన సంజీవ్‌ అర్థాంతరంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక రూఫస్‌ పదోతరగతి చదువుతున్నాడు. మృతుడి భార్య మాధవి ప్రైవేట్‌ పాఠశాలలో పనిచేస్తుంది. ఇద్దరి మరణ వార్త విని రేగొండ నుంచి పెద్ద ఎత్తున జనం ఎంజీఎం మార్చురీ చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌ దామెర స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వస్థలమైన రేగొండకు తరలించి అంత్యక్రియలు ని
ర్వహించారు.