పసికందు అమ్మకం ఘటనలో తండ్రి అరెస్టయిన ఘటన జాజ్‌పూర్ జిల్లాలో సంచలనం రేకిత్తించింది. ఇదే వ్యవహారంలో ఇద్దరు మధ్యవర్తులు, మరో ఇద్దరు కొనుగోలుదారులు అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో శిశువుని కొనుగోలు చేసిన దంపతులు, శిశువు అమ్మకానికి బేరం కుదిర్చిన అంగన్వాడీ కార్యకర్త ప్రభాషినీ దాస్, ఆమె సోదరుడు దీపక్ దాస్, శిశువును అమ్మకానికి పెట్టిన తండ్రి నటవర బెహరా ఉన్నారు.
జాజ్‌పూర్ జిల్లాలోని ధర్మశాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సనొరాయిపొడా గ్రామానికి చెందిన నటవర బెహరా భార్య కాంచన్ బెహరా ధర్మశాలఆరోగ్య కేంద్రంలో ఈ నెల 27వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 28వ తేదీన డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది. అదే రోజు శిశువు తండ్రి నటవర బెహరా కేంద్రాపడా జిల్లాలోని మహాకలపడా ప్రాంతానికి చెందిన దంపతులకు రూ.12 వేలకు తన బిడ్డను అమ్మేశాడు. శనివారం సాయంత్రం ఈ సంఘటన వెలుగుచూడడంతో జిల్లా శిశు సంరక్షణ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. దీనిపై కొత్తొపూర్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు దాఖలైంది.
దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి శిశువుని కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఆదివారం ఉదయం సదరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటవర్, కాంచన్ దంపతులకు ఈ బిడ్డ నాలుగో సంతానం కాగా రోజువారీ కూలి పనులతో బతుకు భారమవుతుండడంతోనే శిశువును అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. తమ అభ్యర్థన మేరకే అంగన్వాడీ కార్యకర్త బిడ్డను దత్తత తీసుకునే వారిని సంప్రదించిందని దంపతులు తెలిపారు.