గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలేజీ నుంచి కూతురిని తీసుకుని వస్తుండగా.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. అచ్చంపేట మండలంలోని తాళ్లచెరువుకు చెందిన శాంతమ్మ, ఆల్లయ్య భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు శిరీష గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. గురువారం ఉదయం కాలేజీ నుంచి కూతురు శిరీషను బైక్ ఎక్కించుకుని ఆల్లయ్య ఇంటికి వస్తున్నాడు.
మేడికొండూరు వద్ద వీరి బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఇద్దరు కిందపడిపోగా.. వారిపై లారీ దూసుకెళ్లింది. దీంతో ఘటన స్థలంలోనే తండ్రీకుమార్తె మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి డ్రైవర్ లారీతో పరార్ కాగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.