కులమౌఢ్యానికి యువతి బలైంది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని ఓ తండ్రి తన కుమార్తెను కత్తితో పొడిచి అంతమొందించాడు. ఈ దారుణ ఘటన మైసూరు జిల్లా పిరియా పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని మహాదేశ్వర దేవాలయం రోడ్డులో జయరాం అనే వ్యక్తి తన కు టుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈయన కుమార్తె గాయత్రి(21) ఇదే పట్టణానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడిని ప్రేమిస్తోంది.
అతన్నే పెళ్లి చేసుకుంటానని గాయత్రి చెబుతుండేది. అయితే రాఘవేంద్రది వేరే కులం కావడంతో తండ్రి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈక్రమంలో శుక్రవారం వ్యవసాయ తోటలో ఉన్న తండ్రి జయరాంకు కుమార్తె గాయత్రి భోజనం తీసుకెళ్లింది. అక్కడ మరో మారు పెళ్లి విషయంపై ప్రస్తావన వచ్చింది. విచక్షణ కోల్పోయిన జయరాం గాయత్రిని కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పిరియూ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.