కుమార్తెను గొంతుకోసి హత్య చేసిన తండ్రి

కుమార్తెను గొంతుకోసి హత్య చేసిన తండ్రి

చెన్నై విల్లివాక్కంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తి భార్యపై అనుమానంతో కుమార్తెను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. రెడ్‌హిల్స్‌ రోడ్డు 5వ వీధికి చెందిన రాధాకృష్ణన్, లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు, కుమార్తె వదనశ్రీ ఉన్నారు. లావణ్య ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రాధాకృష్ణన్‌ భార్యపై అనుమానంతో రోజూ గొడవపడేవాడు.

దీంతో లావణ్య పిల్లలను తీసుకుని అదే ప్రాంతంలో విడిగా ఉంటోంది.రాధాకృష్ణన్‌ శనివారం రాత్రి పిల్లలను చూడడానికి లావణ్య వద్దకు వెళ్లాడు. ఆమె ఇంట్లో లేదు. తల్లి ఎవరితోనైనా మాట్లాడుతోందా అని కుమార్తె వదనశ్రీని అడిగాడు. బాలిక మౌనంగా ఉండడంతో ఆగ్రహం చెందిన అతను కత్తి తీసుకుని కుమార్తె గొంతు కోశాడు. పొట్టలో పొడిచాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రాధాకృష్ణన్‌ అక్కడి నుంచి పారిపోయాడు.

బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.పరిశీలించిన వైద్యులు బాలిక అప్పటికే మృతిచెందినట్టు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న విల్లివాక్కం పోలీసులు చిన్నారి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం 3 గంటల సమయంలో రాధాకృష్ణన్‌ విల్లివాక్కం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.