మద్యం మత్తులో కన్న కొడుకునే హతమార్చాడు ఓ తండ్రి. ఈ సంఘటన గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. జిన్నారం సీఐ లాలూనాయక్, ఎస్‌ఐ విజయకృష్ణ, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డమీది శ్రీనివాస్‌గౌడ్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహం జరిగింది. కుమారుడు సాయికుమార్‌గౌడ్(25) గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నాడు. శ్రీనివాస్‌గౌడ్ నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. సోమవారం రాత్రి యథావిధిగా మద్యం తాగి ఉన్నాడు. సాయికుమార్‌గౌడ్ కూడా మద్యం తాగాడు. కొడుకు వద్ద ఉన్న కూలి డబ్బులు రూ.7వేలు తనకు ఇవ్వాలని తండ్రి కోరాడు.
ఇందుకు కొడుకు ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. శ్రీనివాస్‌గౌడ్ భార్య నివారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్‌గౌడ్ కోపంతో కుమారుడి తలపై కట్టెతో కొట్టాడు. దీంతో సాయికుమార్‌గౌడ్‌కు బలమైన గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సాయికుమార్‌గౌడ్ మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ విజయకృష్ణ తెలిపారు.