తనయుడిని చంపిన తండ్రి.. రాత్రంతా అక్కడే

father killed son in nagpur

ఓ తండ్రి తన కుమారుడిని చంపి.. రాత్రంతా మృతదేహం వద్దే ఉండిపోయాడు. మరుసటి రోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. దామోదర్ బాలపురే(71)కు సంజయ్(38) అనే కుమారుడు ఉన్నాడు. సంజయ్ వృత్తిరీత్యా కార్పెంటర్. అయితే ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మామను చంపిన కేసులో గత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు సంజయ్. భార్యా, పిల్లలు కూడా సంజయ్‌కు దూరంగా ఉంటున్నారు.

జైలు నుంచి విడుదలైన సంజయ్.. మద్యానికి బానిస అయ్యాడు. డబ్బులివ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన సంజయ్.. తన ఇంటికొచ్చి తండ్రితో గొడవ పెట్టుకున్నాడు. బైక్ కొనాలి.. తక్షణమే రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే చంపేస్తానని బెదిరించి సంజయ్ నిద్రపోయాడు. కుమారుడి వేధింపులు భరించలేని తండ్రి.. నిద్రిస్తున్న సంజయ్‌ను హత్య చేశాడు. ఆ రాత్రంతా కుమారుడి మృతదేహం వద్దే ఉండి.. మరుసటి రోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.