అభం శుభం తెలియని రెండేళ్ల కుమారుడిని కసాయి తండ్రి అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేసిన సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం లంగర్ హౌస్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన హాసిబ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి గత ఆరు సంవత్సరాల క్రితం హస్రత్ బేగంతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం కలిగారు.(చదవండి: రాజు… నేరచరితుడే!)
కాగా, గత మూడు సంవత్సరాలుగా హాసిబ్ మానసికంగా బాగా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం నాలుగున్నర గంటల సమయంలో కోపంతో కత్తి తీసుకుని పెద్ద కుమారుడుని ఇస్మాయిల్ (2)ని మొదటి అంతస్తు లోకి తీసుకెళ్లి, గొంతు కోసి పరారయ్యాడు. ఇంట్లో భార్య హస్రత్ బేగం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.