వలసపల్లికి చెందిన రజనికి అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి నవీన్‌బాబుతో 2011లో వివాహం జరిగింది. వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ప్రతిరోజూ తాగి వచ్చి భార్యను తిట్టడం, కొట్టడం చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. నాలుగోసారి అబార్షన్ అయింది. తరువాత ఐదోసారి గర్భం ధరించగా గతేడాది జూలైలో ఆడపిల్ల పుట్టింది. జ్వరం వస్తే పసిబిడ్డను ఆస్పత్రిలో చూపిస్తామని చెప్పి నా భర్త, అత్తమామలు, ఆడపడుచు కలసి తీసుకెళ్లారు. పాప గురించి అడుగుతుంటే పాప బలహీనంగా ఉందని, ఆస్పత్రిలో చూపిస్తున్నామంటూ నమ్మబలికారు.
తరువాత పాప దగ్గరకు వెళ్తానని పట్టుబడటంతో అందరూ కలిసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తికి రూ.1.50 లక్షలకు అమ్మివేశారని తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇదిలా ఉండగా పాప గురించి అడుగుతున్నానని ఈ నెల 7వ తేదీన భర్త, అత్తమామలు, ఆడపడుచులు తనను పట్టుకుని నోట్లో పురుగుమందు పోసి చంపాలని ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించింది.
తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి గట్టిగా ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు చూసి వారిని మందలించారని పేర్కొంది. తన పాపను అమ్మివేసిన వారిపై చర్య తీసుకోవడంతో పాటు తనకు పాపను అప్పగించి, వారి నుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా ఫిర్యాదులో కోరింది. దీనిపై ముసునూరు ఎస్‌ఐ రాజారెడ్డిని వివరణ కోరగా రజని ఫిర్యాదు చేసింది కాని కేసు నమోదు చేయలేదని, వారం రోజుల క్రితం ఒక ఫిర్యాదు ఇవ్వగా దానిని కేసు కట్టామని తెలిపారు.