కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అడ్డా కూలీగా పని చేసుకొని జీవనం సాగించే ఓ గిరిజన మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధులు అతికిరాతకంగా ఆమెను చంపేశారు. కామారెడ్డి గ్రామీణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ తండాకు చెందిన మహిళ స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో కొన్నాళ్ల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చి అడ్డా కూలీగా పనిచేస్తోంది. నవంబరు 17న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టారు.
విచారణలో లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన ప్రకాశ్‌తో ఆమెకు పరిచయమున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకొని కామారెడ్డి శివారులోని లింగాపూర్ పరిధిలో ఆ మహిళ మృతదేహాన్ని చూపించాడు. పనికోసమని తన దగ్గరకు వచ్చిన ఆ మహిళను బైక్ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లానని, మద్యం తాగించి అత్యాచారం చేశానని ప్రకాష్ తెలిపాడు. ఈ విషయాన్ని ఆమె ఎవరికైనా చెబుతుందన్న అనుమానంతో గొంతుకు చున్నీ బిగించి హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. దీంతో ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించిన పోలీసులు నివేదిక ఆధారంగా ప్రకాష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.