టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఫియోనా చాంపియన్

టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఫియోనా చాంపియన్

కరోనా వైరస్‌తో మార్చి రెండో వారంలో అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్‌లకు బ్రేక్‌ పడింది. ముఖ్యంగా కరోనా దెబ్బకు విలవిల్లాడిన దేశాల్లో ఇటలీ ఒకటి. అయితే ఇటలీతోపాటు యూరోప్‌ దేశాల్లో క్రమక్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా గత నెలలో యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా ఎగ్జిబిషన్‌ టెన్నిస్‌ టోర్నీలు జరిగాయి.

అంతా సవ్యంగా ఉందనిపించడంతో ఆగస్టు 3న ఇటలీలోని పలెర్మో పట్టణంలో మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ఆధ్వర్యంలో అధికారిక టోర్నమెంట్‌ పలెర్మో ఓపెన్‌ మొదలైంది. ఐదు నెలల విరామం తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ అధికారిక టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్‌ రైజింగ్‌ స్టార్‌ క్రీడాకారిణి ఫియోనా ఫెరో చాంపియన్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్‌ ఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 53వ ర్యాంకర్‌ ఫియోనా ఫెరో 6–2, 7–5తో ప్రపంచ 22వ ర్యాంకర్, నాలుగో సీడ్‌ అనెట్‌ కొంటెవి (ఎస్తోనియా)పై విజయం సాధించింది.