కాళేశ్వరంతో పండుగ

festival with kaaleshwaram

కాళేశ్వరం ప్రారంభంతో పండుగ వాతావరణం నెలకొన్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషే ప్రధానమని తెలిపారు. మంగళవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. తొలుత కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకొన్న ఎర్రబెల్లి.. అక్కడ అప్రోచ్ కెనాల్, హెడ్‌రెగ్యులేటర్, ఫోర్‌బేను పరిశీలించారు. గోదావరిలో నీటిప్రవాహం, కన్నెపల్లి పంపుహౌస్‌లో మోటర్లు పనిచేస్తున్న తీరు, గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బరాజ్‌కు చేరుతున్న నీటివివరాలను కలెక్టర్ వెంకటేశ్వర్లు, సాగునీటిశాఖ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. పంపుహౌస్‌లోని మోటర్లు గోదావరి జలాలను గ్రావిటీ కెనాల్‌లో ఎత్తిపోస్తున్న డెలివరీ సిస్టర్న్‌ను సైతం సందర్శించారు.

అక్కడ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని.. ప్రాజెక్టు రచన, డైరెక్షన్, నిర్మాత అన్నీ ఆయనేనని పేర్కొన్నారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ ఎండిపోతుందని, తెలంగాణ ఎడారి అవుతుందని గతంలో ఆందోళన చేశానని, ఈరోజు కేసీఆర్ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్‌తో ఎస్సారెస్పీలో నీరు నింపే ఏర్పాట్లు జరగడం ఆనందంగా ఉన్నదన్నారు. తెలంగాణ ప్రజలకు తాగు, సాగునీరు ఇస్తున్న సీఎం కేసీఆర్ మహాత్ముడు అని మంత్రి ఎర్రబెల్లి అభివర్ణించారు.

కాళేశ్వరంలో అసలు మోటర్లు నడవడం లేదంటున్న విపక్షాలు.. విమర్శలు మాని ఇక్కడకు వచ్చి మోటర్లు ఎత్తిపోస్తున్న గోదావరి జలాలను నెత్తిన చల్లుకొనిపోతే బాగుంటుందని హితవుపలికారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని, అక్కడి నుంచి కొంతైనా సాయంచేస్తే తెలంగాణకు మరింత ప్రయోజనం చేకూరేదని పేర్కొన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. మంత్రివెంట ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి రాకేశ్, పుట్ట మధుకర్, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ శోభ, మహదేవపూర్ ఎంపీపీ రాణిబాయి తదితరులు ఉన్నారు.