ఫెవిక్విక్ బామ్మ పుష్ప జోషి(87) ఈ నెల 26న కన్నుమూశారు. గతవారం ఇంట్లో కాలుజారి పడిపోయిన పుష్ప ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా మంగళవారం మరణించారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ గుప్తా ఆమెకు నివాళి అర్పించారు. ఆమె మరణ వార్తపై విచారం వ్యక్తం చేశారు. ‘నేను దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఒకటైన ‘రైడ్’లో నీ నటన నాకు గుర్తుండిపోతుంది. నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉండేదానివి. మమ్మల్ని వీడి వెళ్లడం బాధాకరం. నిన్ను ఎంతగానో మిస్ అవుతాం బామ్మ..’ అంటూ ట్విటర్‌లో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. 85వ ఏటలో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పుష్ప జోషి అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించిన ‘రైడ్’తో తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే అందరి మనసులను గెలుచుకున్న ఆమె ఆ తర్వాత ‘రాంప్రసాద్ కి తెహర్వీ’ చిత్రంలోనూ మెరిశారు. వీటికన్నా ముందు ఆమె కుమారుడు నిర్మించిన జాక్యా అనే షార్ట్‌ఫిల్మ్‌లోనూ నటించారు. చివరిసారిగా ‘ఫెవిక్విక్’ వాణిజ్య ప్రకటనలో కనిపించి ఫెవిక్విక్ బామ్మగా గుర్తింపు పొందారు.