ఇండిగో అదరహో..

financial result of leading private airline indigo

ప్రమోటర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోకు ఆర్థిక ఫలితాల రూపంలో భారీ ఉపశమనం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,203 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం కంపెనీ చరిత్రలో తొలిసారి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ సంస్థను నిర్వహిస్తున్నది. క్రితం ఏడాది ఇదే కాలానికిగాను నమోదైన రూ.27.79 కోట్ల లాభంతో పోలిస్తే 43 రెట్లు అధికం.

ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను రూ.8,259.69 కోట్ల నుంచి రూ.9,786.94 కోట్లకు ఆదాయం పెరిగినట్లు వెల్లడించింది. వీటిలో నిర్వహణ ఆదాయం 45 శాతం ఎగబాకి రూ.9,420 కోట్లుగా ఉన్నది. ప్రతి కిలోమీటర్‌కు వచ్చే ఆదాయంలో 12.8 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ సీఈవో రోనోజాయ్ దత్ తెలిపారు. కంపెనీ చరిత్రలో ఇంతటి స్థాయిలో లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారని, ప్రమోటర్ల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు త్వరలో సమిసిపోనున్నాయని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు. ప్రయాణికుల ద్వా రా వచ్చే ఆదాయం అధికమవడం, అలాగే కార్గొ పనితీరు కూడా ఈ ఫలితాలకు అద్దం పడుతున్నాయన్నారు. 235 విమానాల ద్వారా 70 నగరాలకు విమాన సేవలు అందిస్తున్నది. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.17,337. 10 కోట్ల మిగులు నిధులు ఉండగా, రూ.18,430.9 కోట్ల అప్పు ఉన్నది. ఇంట్రాడేలో 1.96 శాతానికి పైగా లాభపడిన కంపెనీ షేరు ధర చివరకు స్వల్పంగా పెరిగి రూ.1,463.35 వద్ద ముగిసింది.