దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫిలాండర్‌పై నోరుజారిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి జరిమానా పడింది. కేప్‌టౌన్ వేదికగా తాజాగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఫిలాండర్ (8: 51 బంతుల్లో 2×4) బ్యాటింగ్ చేస్తుండగా.. అతడ్ని ఉద్దేశిస్తూ జోస్ బట్లర్ కొన్ని బూతులు తిట్టాడు. ఆ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డవడంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు.
మైదానంలో క్రమశిక్షణ తప్పిన జోస్ బట్లర్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన రిఫరీ.. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా యాడ్ చేశాడు. రూల్స్ ప్రకారం.. క్రికెటర్ ఖాతాలో 24 నెలల వ్యవధిలో 4 పాయింట్లు చేరితే అతనిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల్లో నిషేధం పడనుంది. బట్లర్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ చేరడం ఇదే తొలిసారి.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 269 పరుగులకి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటవగా.. అనంతరం దక్షిణాఫ్రికా టీమ్ మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 46 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఇంగ్లాండ్ టీమ్.. రెండో ఇన్నింగ్స్‌ని 391/8తో డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 438 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా టీమ్ 248 పరుగులకి చేతులెత్తేసింది. ఇక రెండు జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభంకానుంది.